ఎక్కాలు - ఎమోషన్
ఎక్కాల పుస్తకం ఎవరు కని పెట్టారో కానీ నా చిన్నతనంలో నూటికి కనీసం 70 మంది పిల్లల్ని భయపెట్టేది ఈ పుస్తకం. ప్రతీ పుస్తకానికీ గైడ్లు వున్నాయి. కానీ దీనికి లేవు. అలా అంకెలు నేర్చుకుని ఒకటో తరగతి నించి రెండో తరగతిలోకి అడుగు పెట్టామో లేదో ఈ పుస్తకం పుస్తకాల సంచీలోకి చేరిపోయేది. అందులో పట్టుమని 10 పేజీలు లేకపోయినా లావుపాటి తెలుగు, సామాన్య శాస్త్రము, సాంఘిక శాస్త్రము లాంటి పుస్తకాల కంటే ఎక్కువ భయపెట్టేది. ఈ ఏడాది పుస్తకాలన్నీ మారిపోయాయి. కొత్త పుస్తకాలు కొనండి అని ఇంట్లో గొడవ పెడితే అన్నీ కొనేవారు కాని, ఎక్కాల పుస్తకం మాత్రం కొనేవారు కాదు. ఏ అక్కో, అన్నో వాడేసి చిరిగి శల్యావస్థ లో వున్న పుస్తకం వాడుకోమనే వారు. ఎందుకంటే ఎక్కాల పుస్తకం ఏమీ మారదు కదా అనేవారు. ఇదొక యునివర్సల్ పుస్తకం. ఏ రాష్ట్రంలోనైనా, ఏ దేశంలోనైనా ఏ ఖండంలోనైనా రెండు రెళ్లు నాలుగే – ఒక్క తెలుగు సినిమాలో తప్ప. అక్కడ మాత్రం “రెండు రెళ్లు ఆరు”. అందరికీ బై డిఫాల్ట్ ఒకటో ఎక్కం వచ్చేస్తుంది కదా. రెండో తరగతిలో రెండో ఎక్కంతో మొదలయ్యేవి పాట్లు. “ రె...