మనుషులు -రకాలు
మనుషులు మూడు రకాలుగా ఉంటారు .
మొదటి రకం ఏ పనినైనా గొప్పగా ప్రారంభిస్తారు పది మందికి చెప్పుకుంటారు.ఏ ఉత్సాహంతో మొదలు పెట్టారో అదే ఉత్సాహాన్ని చివరిదాకా కొనసాగించరు.మొదలు పెట్టిన పనిని మధ్యలోనే వదిలేస్తారు.
రెండవరకం పని మొదలు పెట్టడానికి ముందే వంద ఆలోచిస్తారు అవుతాదా?లేదా? అవకపోతే ఎలా ఎం చేయాలి అని రకరకాలుగా ఆలోచించి సమయం వృధా చేస్తారు.మొత్తానికి పని మొదలు పెట్టరు.
మూడవ రకం పని చిన్నదా ?పెద్దదా? అని ఆలోచించరు ఏ పని అయిన వీళ్ళ చేతిలో పడిందంటే పూర్తి కావాల్సిందే.పూర్తి చేసేదాక వదిలి పెట్టరు. కానీ అదే పనిని సంవత్సరాల తరబడి అయినా చాలా ఓపికగా చేస్తారు చివరకు విజయాన్ని సాధిస్తారు.
ఒక పని ఆరంభించినపుడు ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా వెనకడుగు వేయరాదు .లక్ష్యాన్ని చేరుకునే దాకా అహర్నిశలు కష్టపడాలి. ఈ సాధనలో కఠోర దీక్ష , అంతులేని శ్రమ,దుఃఖము, త్యాగము అన్ని ఇమిడి ఉంటాయి.
అలాంటి కొన్ని పురాణ కథలను మనం తెలుసుకుందాం.
వాయి పుత్రుడు హనుమాన్ ,అతను అత్యంత బలశాలి అతనికి గురువు ఎవరో తెలుసా సూర్యుడు. చిన్నతనంలోనే హనుమంతుడు ఆకాశంలో ఎర్రగా ఉన్న సూర్యుని చూసి పండు అనుకోని పట్టుకోబోయాడు.అతని చేతి కాలింది ఇంద్ర దేవుడికి కోపం వచ్చి హనుమంతుడిని వజ్రాయుదంతో కొట్టాడు, అప్పుడు హనుమాన్ చేతి విరిగింది.అది చూసిన వాయు దేవుడికి కోపం వచ్చి గాలిని మొత్తం ఆపేశాడు.అందరికి గాలి లేకుండా పోయింది .
దేవతలు అంతా బ్రతిమిలాడితే అప్పుడు వాయుదేవుడు గాలివీచాడు.అప్పటి నుండి హనుమంతుడు సూర్యుడి పట్ల ఆకర్షితుడయ్యాడు.కొంచెం పెద్దయ్యాక విద్యాభ్యాసానికి హనుమాను సూరీడిని ఎంచుకున్నాడు.సూర్యుడు నాకు కుదరదు అని చెప్పాడు,నేను ఎప్పుడూ సంచరిస్తూ ఉంటాను ఒక దగ్గర ఉండని నేను నీకు ఎలా విద్య నేర్పగలను అన్నాడు .అయినా కూడా పర్వాలేదు నేను మీతో పాటే తిరుగుతూ విద్య నేర్చుకుంటా అన్నాడు.అతని జిజ్ఞాసకు సరే అన్నాడు.అప్పటినుండి అతన్ని శిష్యుడిగా స్వీకరించాడు అతని ద్వారా నాలుగు వేదాలను ఇతర విద్యలను నేర్చుకున్నాడు.
హనుమంతుడిని చూసి నేటి తరం విద్యార్థులు గురువును ఎలా గౌరవించాలి,ఎంత దీక్షతో విద్యాభ్యాసం చేయాలి అని నేర్చుకోవాలి. నేర్పను అని చెప్పినా కూడా వినకుండా ఒప్పించి తాను విద్య నేర్చుకున్నాడు.ఎంత దూరం అయినా మధ్యలో వదిలి పెట్టకుండా తిరుగుతూ విద్య నేర్చుకున్నాడు.
అలాంటి మరో కథ, ఉత్తనపాదుడికి ఇద్దరు భార్యలు పెద్ద భార్యతో పుట్టిన వాడు ధ్రువుడు ఐదేళ్ల వయసులో అతడు తన తండ్రి తొడపై కూర్చోవాలి అని అనుకుంటే అతడిని సవతి తల్లి కూర్చోనివ్వలేదు.తనను తన తల్లిని ఘోరంగా అవమానించింది.ఆ అవమాన భారంతో మనసు వేదనకు గురి అయింది.అప్పుడు అతను జీవితంలో ఎలా అయినా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని గట్టి సంకల్పం చేసుకున్నాడు.అప్పటి నుండి నారద మహర్షి ఉపదేశంతో తపస్సు చేసాడు. శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై సూర్య చంద్రులు,సప్తఋషులు ప్రదక్షిణ చేసే శాశ్వత స్థానాన్ని వరంగా ప్రసాదించాడు.అదే ఆకాశంలో ధ్రువ నక్షత్రం.తనకు జరిగిన అవమానాన్ని తలచుకొని బాధ పడకుండా ,కృంగిపోకుండా జీవితంలో ఉన్నత స్థానానికి చేరాలని పట్టుదలతో శ్రమించాడు.
మహాభారతంలో పాండవులు కూడా కౌరవులు తమను చిన్నప్పటి నుండి ఎంత బాధ పెట్టినా కూడా అడుగడుగునా అవమానాలు,అగచాట్లు పడ్డారు.జూదంలో తమను అధర్మాంగా ఓడించినా కూడా వారు ధర్మాన్ని వీడలేదు.పన్నెండేళ్ల అజ్ఞాతంలో ధర్మరాజు ఒక మంత్రిగా,భీముడు ఒక వంటవాడిగా, నకుల సహదేవులు ఆవుల రక్షకులుగా ,అర్జునుడు అయితే బృహన్నలగా ,పాంచాలి సైరన్ద్రిగా ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ ఆ హస్తీనాపురానికి వచ్చి రాజు అయ్యాడు ధర్మరాజు. పాశుపతాస్త్రం కొరకు అర్జునుడు చేసిన కఠోర దీక్ష గూర్చి గుర్తు చేసుకోవాలి. అశ్విని దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి నకుల సహదేవులు నీళ్లలో కొన్ని రోజులు దీక్ష చేశారు.మన పురాణాలు ఇతిహాసాలు మనకు నేర్పించేది ఒకటే ఎల్లవేళలా పనిని భక్తితో పూర్తి చేయాలి.భక్తి అంటే దైవ భక్తి కాదు పని పట్ల భక్తి, శ్రద్ధ అని అర్థం.
సంకల్ప సిద్ధితో చేసే ప్రతి పనీ విజయాన్నిస్తుంది అందుకే ఆరంభ శురత్వం పనికి రాదు చివరి దాకా ఆ పని చేయాలి. మనం కేవలం పనిని మాత్రమే చేయాలి ఫలితం వదిలేయాలి ఏదో ఒక రోజు మనం చేసిన ఆ పనికి ప్రతిఫలం ఖచ్చితంగా చూస్తాం.ధర్మం కొరకు నిలబడాలి అధర్మాన్ని విడాలి.
Super 👌🫡
ReplyDelete