దొరలు దోచలేరు, దొంగలెత్తుక పోరు
భ్రాతృజనము వచ్చి పంచుకోరు
విశ్వవర్ధనంబు విద్యాధనమ్మురా
లలిత సుగుణజాల! తెలుగు బాల.
భ్రాతృజనము వచ్చి పంచుకోరు
విశ్వవర్ధనంబు విద్యాధనమ్మురా
లలిత సుగుణజాల! తెలుగు బాల.
పైన పేర్కొన్న ఈ పద్యం తాత్పర్యం ఏమిటో తెలుసా?
దొరలు దోచుకోలేరు మరియు దొంగలు కూడా ఎత్తుకొనిపోలేనిది ,మన సోదరుల మధ్య పంపకాలలో పంచుకోలేనటువంటిది ఏమిటో తెలుసా విద్య .మన చదువును జ్ఞానాన్ని మన నుండి ఎవరూ వేరు చేయలేరు. మనం ఉన్నంత కాలం మనతోనే ఉంటుంది మనం నేర్చుకున్న ఙ్ఞానం.
మీకు ఈ విషయం ఇంకా వివరంగా ఒక కథ ద్వారా చెప్తాను వినండి.
అనగనగా ఒక ఊరిలో ప్రసన్నవర్మ అనే పండితుడు ఉండేవాడు అతడు పేరుకు తగ్గట్టే చాలా ప్రసన్నంగా ఉంటాడు.అతడు వేద వేదాంగాలు చదివిన మహా పండితుడు.అతడికి రవివర్మ అనే కొడుకు ఉండేవాడు.
మనకు బాగా తెలిసిన లోకోక్తి
ప్రకారం "పండిత పుత్ర పరమ శుంఠ" అన్నట్లు రవివర్మకు చదువు వంట బట్టలేదు.ఎంత చెప్పినా చదివి ఎవరిని ఉద్దరించాలి ఏదైనా పని చేసుకొని బ్రతుకుతాను లే అని సోమరి పోతు లాగ ఉండేవాడు.
ఒకరోజు ప్రసన్న వర్మ ప్రవచనాలకు వెళ్ళాడు అక్కడ మంచిగా ప్రవచనాలు చెప్పిన తర్వాత అతడిని కొందరు ఓర్వలేక మీ పుత్రుడికీ ప్రవచనాలు చెప్పండి మాకు కాదు .నీ కొడుకే సరిగ్గా లెడనీ నువ్వు మాకేమి నీతులు చెప్పవద్దని అన్నారు ఆ మాటలకు ప్రసన్నవర్మ బాధపడి ఇంటికి వచ్చాడు.
ఇంటికి వచ్చాక రోజూ అతడిని బలవంతంగా ప్రవచనాలకు తీసుకొని వెళ్లేవాడు .ప్రతిరోజూ వెళ్ళడం వలన అతనికి కూడా కొద్ది కొద్దిగా ఆసక్తి మొదలైంది . ఒకరోజు రాజభవనం నుండి పిలుపు వచ్చింది , ప్రసన్నవర్మ
రవివర్మ ఇద్దరూ వెళ్ళారు ఎప్పటిలాగానే ప్రవచనాలు చెప్పాడు అవి విని రాజు గారు బంగారు హారం మెడలో వేశారు. అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ ఎంతో గౌరవంగా మాట్లాడారు అదంతా చూస్తూ ఉండిపోయాడు రవివర్మ.
సాయంత్రం ఇద్దరూ ఇంటికి బయలుదేరారు మార్గ మాధ్యమంలో అడవిని దాటుకొని ఊరికి వెళ్ళవలసి వస్తుంది . చీకటి అవుతుండడంతో త్వరగా బయలుదేరారు కానీ అడవిలో కాపు కాస్తున్న దొంగల ముఠా వారిని అడ్డగించింది ప్రసన్న వర్మ దగ్గర వున్న బంగారు హారం అంతకు ముందునుంచే అతడు సంపాదించిన ఉంగరాలు తీసుకున్నారు.రవివర్మ దగ్గర నుండి కూడా ఉంగరాలు బలవంతంగా కత్తులతో బెదిరించి తీసుకున్నారు.వాళ్ళు వెళ్ళిన తరువాత రవివర్మ వాళ్ళ నాన్నతో "నాన్న ! అలా వాళ్ళు దోచుకెళ్ళడం బాధగా ఉంది అన్నాడు". ప్రసన్న వర్మ మాత్రం నీకు గాయాలు ఏమి కాలేదు కదా అన్నాడు.ఎందుకు నాన్న అలా అంటావు అవన్నీ నువ్వు కష్టపడి సంపాదించినవి కదా, అలా ఒకరు ఎత్తుకెళ్లినా ఎందుకు వాళ్ళని క్షమిస్తావు అన్నాడు.
ప్రసన్న వర్మ ప్రశాంతంగా వాళ్ళు నా దగ్గర నుండి తీసుకెళ్లింది కేవలం బంగారు ఆభరణాలు మాత్రమే అంతకన్నా విలువైన జ్ఞానాన్ని నా దగ్గర నుండి వాళ్ళు తీసుకెళ్లలేదు నా ప్రాణం ఉన్నన్ని రోజులు ఈ జ్ఞానాన్ని పది మందికి పంచుతాను మరల సంపాదించుకుంటాను అన్నాడు .ఆ మాటతో రవివర్మకు జ్ఞానోదయం అయింది . చదువు వల్ల సమాజంలో గుర్తింపు ,గౌరవం లభిస్తాయి అలాగే చదువు నేర్పే నైపుణ్యాలు నిన్ను ఎప్పటికీ ఉన్నత స్థానంలో నిలబెడతాయి అని చెప్పాడు ప్రసన్న వర్మ .రవివర్మ చదువు మీద దృష్టి పెట్టాడు ప్రసన్నవర్మ లాగ ప్రవచనాలు చెప్తూ మంచి మార్గంలో వెళ్ళాడు.
విద్య మనిషికి కేవలం ఉద్యోగాన్ని మాత్రమే ఇవ్వదు. సమాజంలో గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, మంచి ఆలోచనా విధానాన్ని కూడా ఇస్తుంది. డబ్బు, ఆస్తులు పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ జ్ఞానం మన జీవితాంతం మనతోనే ఉంటుంది. అందుకే విద్యే మనిషికి నిజమైన సంపద.
విద్య మనకు ఎప్పుడూ మంచే చేస్తుంది కానీ కీడు చేయదు.“విద్య అనే ధనాన్ని ఎవరూ దోచుకోలేరు; పంచిన కొద్దీ అది మరింత పెరుగుతుంది.”
Comments
Post a Comment