తెలుగు వారికి ఉగాది నుండి నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది , మహారాష్ట్ర వారికి గుడి పడవా తో నూతన సంవత్సరం అలాగే కేరళ వాళ్లకు ఓనం అనేది కొత్త సంవత్సరం.
ఓనం పండుగను దేవభూమిగా ప్రసిద్ధి గాంచిన కేరళ వాసులు రాజైన బలి చేసిన త్యాగానికి చిహ్నంగా జరుపుకుంటారు.
హస్త నక్షత్రం ఆధ్వర్యంలో అవని మాసంలో ఈ పండుగను చితిరాయ్, స్వాతి, విశాకం, అనుసం, కెట్టై, మూలం, పురాదం, ఉత్దానం మరియు తిరువొనం పది నక్షత్రాల పది రోజులపాటు ఎంతో వైభవంగా చేసుకుంటారు.
మళయాళీల తోలి పండుగ ఓనం. కేరళ ఘనమైన సంస్కృతి సాంప్రదాయాలకు వారసత్వంగా ఈ పండుగని పది రోజులు నిర్వహిస్తారు. బలి చక్రవర్తి ఆగమనాన్ని పురస్కరించుకొని కేరళ వాసులు ఓనం పండుగని సంబరాల మధ్య జరుపుకుంటారు.
మహా బలిచక్రవర్తి ఆ రోజున రసాతలం నుంచి దేవభూమి కేరళలో ఆత్మ రూపిగా వస్తాడని ప్రజల విశ్వాసము. తమ ఇళ్ళలోకి బలి చక్రవర్తిని ఆహ్వానించడానికి ఇంటి ముందు రంగు రంగు పూలతో ముగ్గులు వేసి అలంకరణ చేస్తారు. వీటిని "పుగలం" అంటారు. ఇంక ముగ్గులలో దీపాలు ఉంచి స్త్రీలు, యువతులు తెల్లనివస్త్రాలు బంగారురంగు అంచుతో వున్నవి ధరించి ఆ ముగ్గుల చుట్టూ ఆడి పాడతారు. "కైకుట్టికల్", "తుంబి తులల్" అనే ముఖ్యమైన నృత్యాలు చేస్తారు. 10రోజుల పాటు సంప్రదాయాలను పాటిస్తూ మలయాళీలు సంప్రదాయరుచులతో రకరకాల వంటలు చేస్తారు. తాజా బియ్యంపిండి, ఏవియల్, పాలు, పెరుగు, బియ్యం, కాయధాన్యాలు, నెయ్యి, సాంబార్, కలాన్, ఓలన్, రసం, పాలవిరుగుడు, తోరన్, చక్కెర విప్లవం, ఉమ్మడి, కిచాడి, పచాడి, అల్లం, ఎరికేరి, కారం అటుకులు, గుమ్మడికాయ ఉడకబెట్టిన పులుసు, పప్పాడమ్, ఊరగాయలు వంటి ఆహారాలు భగవంతుడి కోసం తయారు చేసి నైవేద్యం పెడతారు. జీర్ణక్రియకు సహాయపడటానికి చివర్లో అల్లం మరియు పులుపు ఆహారంలో కలుపుతారు.
ఓనం పండగకు మహాబలికి గల సంబంధం ఈ కథలో తెలుసుకుందాం.
పూర్వకాలంలో మహాబలి అనే గొప్ప రాక్షస రాజు ఉండేవాడు. అతడు ఎంతో పరాక్రమవంతుడు. తన శక్తితో మూడు లోకాలను జయించి , ప్రజలను ధర్మంగా పరిపాలించేవాడు. అతడు గొప్ప దాత కూడా. తన దగ్గరకు వచ్చినవారిని ఎవరినీ ఖాళీ చేతులతో పంపేవాడు కాదు.
మహాబలి తన రాజ్యాన్ని విస్తరించుకుంటూ దేవతలకు కూడా సవాలుగా మారాడు. దీంతో దేవతలు శ్రీమహావిష్ణువును ప్రార్థించారు.
అప్పుడు విష్ణుమూర్తి వామన అవతారం ఎత్తాడు. ఈయన ఒక మరుగుజ్జు బ్రాహ్మణుడిగా ఒక చేతిలో కమండలం, మరో చేతిలో గొడుగు ధరించి దర్శనమిస్తారు. ఈయనను దేవతల రాజైన ఇంద్రుడి తమ్ముడిగా భావిస్తారు. ఇంద్రుడిని ఓడించి స్వర్గలోకాన్ని, ఇంద్రపదవిని కైవసం చేసుకున్న బలి చక్రవర్తి ని ఓడించి తిరిగి ఇంద్రుడికి స్వర్గలోకాన్ని, ఇంద్రపదవిని అప్పగించాడానికి వామనుడి గా అవతరించారు.
బలి చక్రవర్తి తన విజయయాత్ర ముగించి మహాయాగం చేసి ఆ సమయం లో విరివిగా దానలు చేస్తున్నాడు.
బ్రహ్మ తేజస్సు, దివ్య యశస్సులతో వెలిగే వటుడైన వామనుడు దండాన్ని, గొడుగును, కమండలాన్ని ధరించి బలి చక్రవర్తి నిర్వహించే యజ్ఞశాలలోకి ప్రవేశించాడు. *'స్వస్తి జగత్త్రయీ భువన శాసనకర్తకు...'* అంటూ బలిని ఆశీర్వదించాడు. సందర్భోచిత లౌక్యాన్ని ప్రదర్శించాడు. వామనుడి వర్చస్సు, వాక్చాతుర్యానికి ముగ్ధుడై బలి చక్రవర్తి ఏం కావాలో కోరుకొమ్మన్నాడు.
"కేవలం నా పాదాలకే పరిమితమైన మూడు అడుగుల భూమిని మాత్రం నాకివ్వు చాలు" అన్నాడు వామనుడు. ఆ వటుడి రూపంలాగానే అతడి కోరిక కూడా కురచగానే ఉందని బలి భావించాడు. భూ దానానికి సమాయత్తమైన బలిని అతడి గురువు శుక్రాచార్యుడు నిలువరించాడు. అయినా బలి శుక్రుడి మాట వినకుండా, వామనుడికి ఉదకపూర్వకంగా భూమిని దానం చేశాడు. త్రివిక్రముడిగా వామనుడు విరాట్ రూపాన్ని సంతరించుకుని, ఓ పాదంతో భూమినీ, మరో పాదంతో స్వర్గాన్నీ ఆక్రమించి, మూడోపాదం బలి శిరస్సుపై ఉంచి, అతణ్ని రసాతలానికి అణగదొక్కాడు. ఇంద్రుడికి తిరిగి స్వర్గలోకాధిపత్యాన్ని కల్పించాడు. బలి సర్వ సమర్పణా భావానికి ప్రసన్నుడైన వామనుడు సుతల లోక రాజ్యాన్ని అనుగ్రహించి, సంవత్సరానికి ఒకసారి భూలోకం లో తన ప్రజలను కలుసుకునే వరం ఇచ్చారు.
ఆవిధంగా ప్రతి సంవత్సరము భూలోకానికి వచ్చే మహాబలి జ్ఞాపకార్ధం కేరళ ప్రజలు ఓణం పండుగను జరుపుకుంటారు. ఆడిన మాట కొరకు ప్రాణ త్యాగం చేసిన గొప్ప వ్యక్తిగా మహాబలి తన పేరును సార్థకం చేసుకున్నాడు. మహాబలి అనగా గొప్ప త్యాగము అని అర్ధం. దేవతలను రక్షించడానికి మరుగుజ్జుగా కనిపించిన వామన మూర్తి అవతారం ఎత్తిన రోజున "తిరువొనం" పండుగ జరుపుకుంటారు.
యువకులు సాంప్రదాయ పడవ పందాలు, కత్తి యుద్ధాలు, విలువిద్య పోటీలు, కబడ్డీ మొదలైన వాటితో తమ సామర్ధ్యాన్ని ప్రదర్శిస్తారు.
తమ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచమని ప్రపంచంలో ఎక్కడ వున్నా మళయాళీలు ఎంతో వైభవంతో
సంతోషంగా పిల్లలు పెద్దవాళ్ళు పది రోజులు గొప్పగా జరుపుకునే ఉత్సవం ఓనం.
"ఆతం" పేరుతో ప్రారంభమయ్యే ఉత్సవాలు పదో రోజున "తిరుఓనం" తో ముగుస్తాయి మళయాళీలు ఓనంని పకృతి పండుగగా కూడ భావిస్తారు
ఓనం పండగ ఎంత ప్రత్యేకమో అక్కడ చేసే వంటకాలు కూడా అంతే ప్రత్యేకం.దీనిని ఓనం సధ్య అంటారు.
దానం చేయడం గొప్ప గుణం. కానీ దానికంటే గొప్పది ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం. అహంకారం ఎంత ఉన్నా, వినయం మరియు భక్తి మనిషిని గొప్పవాడిని చేస్తాయి.
ఈ పండుగ విశేషాలు తెలుసుకోవడానికి విదేశీయులు సైతం కేరళ వస్తుంటారు.
Comments
Post a Comment