ఆషాఢ మాసం మొదలుకొని శ్రావణ మాసం చివరి ఆది లేక గురువారం వరకు తెలంగాణా అంతటా ఎంతో కన్నుల పండగగా జరిగే పండగ బోనాల పండగ . ఇది తెలంగాణా రాష్ట్ర పండగ.
ఈ పండగ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఈ పండగ ప్రతి ఇంట్లో సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది .
ఆషాఢ మాస బోనాలు గోల్కొండ కోటలో వెలసిన జగదాంబిక అమ్మవారితో మొదలవుతాయి .
తర్వాత బల్కంపేట ఎల్లమ్మ తల్లికి రెండవ బోనం సమర్పిస్తారు . ఇక్కడ అమ్మవారి కళ్యాణం కూడా కన్నులపండుగగా జరుగుతుంది . ఆ తర్వాత వచ్చే ఆదివారం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారికి సమర్పిస్తారు, ప్రతి గుడికి బంగారు పాత్రలో బోనాన్ని సమర్పిస్తారు బోనంతో పాటు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు తీసుకొని వెళ్తారు. భక్తులు కూడా ఆ ప్రాంతానికి చెందిన వారు బోనాలు తీసుకొని వెళ్తారు.ఆషాఢమాసం నాల్గవ వారం హైదరాబాద్ అంతటా ఈ ఉత్సవాలు జరుగుతాయి.
శ్రావణమాసం మొదటి వారం నుండి హైదరాబాద్ చుట్టు పక్కల గ్రామాల్లో ఈ ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ఇది కూడా నాలుగు వారాల పాటు జరుగుతుంది .
అసలు ఈ బోనాల పండగకు ఎందుకు ఇంత ప్రాధాన్యం ఉంది అనేది తెలుసుకుందాం. ప్రతి పండగ వెనుక
ఒక ఆచారం ఉంటుంది ఆ కథ ఇప్పుడు వినండి.
పూర్వం ఓ గ్రామంలో ఒక ఇంట్లో చిన్న పిల్లలకు అమ్మవారు అయింది ఆ పాపను ఎంతోమంది వైద్యుల దగ్గరకు తీసుకుని వెళ్ళినా కూడా ప్రయోజనం లేదు ఆ సమయంలో ఇంట్లోని పెద్దావిడ నువ్వు వెళ్ళి అమ్మ వారికి మొక్కు ,ఆమె దగ్గరకు ఒక చెంబులో నీరు ,వేపాకులు తీసుకెళ్ళు అని చెప్పింది. ఆ గృహిణి అలాగే అని గుడికి వెళ్ళి అమ్మవారికి నీళ్లు ఆరబోసి వచ్చింది .ఆ తర్వాత ఆ వేపాకులతో పాపకు తుడిచింది ,పాపకు తగ్గుముఖం పట్టింది.
ఆమె మొత్తం తగ్గి పోతే నేను ప్రసాదం వండి పెడతాను అని మొక్కుకుందట నిజంగానే తగ్గి పోయింది . అప్పుడు ఆమె ఒక కుండ తీసుకొని దానిలో బియ్యం పోసి నీళ్ళు వేసింది బెల్లం కొంచెం పసుపు వేసి వండింది.ఆ తర్వాత కుండకు సున్నం రాసి పసుపు కుంకుమలతో అలంకరించింది దానిపైన ఒక చిన్న కుండ పెట్టి దానిలో చింతపండు పెరుగు వేసి ఆ పైన దీపం పెట్టింది , కుండకు కొన్ని వేపాకులు కట్టింది అది తీసుకుని వెళ్ళి అమ్మవారికి భక్తితో సమర్పించింది.
ఈ పండుగను అమ్మవారికి అంకితం చేస్తారు. గ్రామాలు, పట్టణాల్లో భక్తులు అమ్మవారికి కృతజ్ఞతగా బోనం సమర్పించి ఆమె ఆశీర్వాదం కోరుకుంటారు.
ఇది కాలక్రమేనా అలాగే కొనసాగుతుంది.
"బోనం" అంటే భోజనం లేదా నైవేద్యం. కొత్త మట్టి లేదా లోహ పాత్రలో బియ్యం, పాలు, బెల్లంతో అన్నం వండి, పసుపు, కుంకుమతో అలంకరించి, వేపాకులతో పాటు దీపం వెలిగించి అమ్మవారికి సమర్పిస్తారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో తలపై బోనం మోసుకుని భక్తి గీతాలు పాడుతూ ఊరేగింపుగా ఆలయానికి వెళ్తారు.
మహంకాళి అమ్మవారి గురించి ఒక చిన్న కథ.
హైదరాబాద్ లో ఒకప్పుడు ప్లేగు వ్యాధి ప్రబలింది . చాలా మంది అనారోగ్యం పాలు అయ్యారు , అప్పుడు సైనిక దళంలో పని చేసే సూరటి అప్పయ్య అనే సైనికుడు ఉండేవాడు. 1813 వ సంవత్సరంలో ఆయన సికింద్రాబాద్ నుండి మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి సైనిక దళంలో పని చేయడానికి వెళ్ళాడు అప్పుడు అక్కడ ఉన్న మహంకాళి అమ్మవారిని మా రాష్ట్రంలో ప్లేగు తగ్గాలని మొక్కుకున్నాడు. తగ్గితే విగ్రహం ప్రతిష్టిస్తానని మొక్కుకున్నాడు .ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక ప్లేగు వ్యాధి తగ్గింది.
అమ్మవారికి మొక్కుకున్నట్టు మహంకాళి అమ్మవారిని సికింద్రాబాద్ లో నిర్మించాడు అప్పటి నుండి ఇప్పటి దాకా నిర్విరామంగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారు పూజలు అందుకుంటుంది. బోనాలకు సంబంధించి ఈ రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
బోనాల వేడుకల్లో పోతురాజు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడు . అమ్మవారి సోదరుడిగా భావించే పోతురాజు డప్పుల నడుమ ఉత్సాహంగా నృత్యం చేస్తూ ఊరేగింపుకు నాయకత్వం వహిస్తాడు. బోనాలు ఎంత అందంగా ఉంటాయో పోతరాజు నృత్యం కూడా అంతే అందంగా ఉంటుంది. అలాగే రంగురంగుల అలంకరణలు, జానపద కళారూపాలు, డప్పు వాయిద్యాలు ఈ పండుగకు మరింత వైభవాన్ని తీసుకొస్తాయి.బోనాలు అంటే ఆడపడుచుల సంబరాలు , శివశక్తుల ఆటలు , పోతరాజుల విన్యాసాలు
ముఖ్యమైనవి.అమ్మవారు గ్రామ ప్రజలను అంటువ్యాధుల నుండి కాపాడుతుందని నమ్మి ప్రతి గ్రామంలో ఈ బోనాల ఉత్సవాలు నిర్వహిస్తారు.
రెండవ రోజు బోనాల తర్వాత రంగం కార్యక్రమం ఉంటుంది . ఆ కార్యక్రమంలో ఒక స్త్రీ పసుపు కుంకుమలు అలంకరించుకొని పచ్చి కుండ పైన నిలబడి భవిష్యవాణి వినిపిస్తుంది .రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అని చెప్తుంది.
బోనాలు కేవలం ఒక పండుగ మాత్రమే కాదు; తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, భక్తి, సామాజిక ఐక్యతకు ప్రతీక. ఈ సందర్భంగా ప్రజలు అమ్మవారిని ప్రార్థిస్తూ కుటుంబంలో సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని కోరుకుంటారు.
Comments
Post a Comment