శని - శివ - హనుమంతుడు కథ
ఒకరోజు పరమశివుడికి ఉదయాన్నే ఒక కల వచ్చింది. ఆ కలలో శని భగవానుడు నేను నిన్ను ముప్ప తిప్పలు పెడతా ఈ రోజు సాయంత్రం వరకు కనీసం 4 నుండి 5 గంటలు అని చెప్పాడు . శని భగవానుడు ఎంతటి వారినైనా ముప్ప తిప్పలు పెడతారు అని తెలిసిన మహా శివుడు ఎలాగైనా తప్పించుకోవాలని అనుకున్నాడు . ఆ రోజు తొందరగా స్నానం చేసి కూర్చొని ఆలోచించసాగాడు ఎలాగైనా శని నుండి తప్పించుకోవాలి అని , సమయం గడుస్తుంది . వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది , శివుడు పార్వతిని వాళ్ళ బంధువుల ఇంటికి , పిల్లలను స్నేహితులతో ఆడుకోవడానికి పంపించి వేశాడు.
ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు అతను కూడా అలా కూర్చోకుండా ఒక గుంత తీసి దానిలో కూర్చుని మూత పెట్టుకున్నాడు.ఆ గుంతలో మొత్తం తడిగా ఉండి ఒకటే వాసన అయినా కూడా ఆ గుంతలోనే సాయంత్రం వరకు కూర్చున్నాడు . సాయంత్రం 6 దాటింది అని నిర్ధారించుకున్న తర్వాత బయటికి వచ్చాడు .బయటకు వచ్చి హమ్మయ్య శనికి నేను దొరకలేదు అతడు నన్ను పట్టుకోలేదు అని తనకు తానే గర్వంగా కూర్చున్నాడు.అతనికి ఎదురుగా శని దేవుడు కూర్చొని ఉండడం చూసి , మహాశివుడు గట్టిగా నవ్వాడు ఏమయ్యా శని నన్ను పట్టి పీడిస్తా అన్నావు నువ్వు రానే రాలేదు సమయం ఐపోయింది కదా అన్నాడు. అయ్యో శివా నువ్వు ఎంత అమాయకుడివి నేను నిన్ను ఎక్కడ పట్టుకుంట అని నువ్వే నీ భార్యాబిడ్డలనూ బయటకు పంపావు , నువ్వేమో ఎంత కంపు కొట్టినా కూడా ఆ గుంతలో కూర్చున్నావు ఇంతసేపు, ఇది నా ప్రభావమే అని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అన్నాడు.శివుడు తెల్లబోయాడు, తేరుకొని నువ్వు అసాధ్యుడివి శని అన్నాడు.
శివుడిని కూడా పీడించానని గర్వంతో శనిదేవుడు విర్రవీగుతున్నాడు , అతని గర్వాన్ని అణచాలని నారదుడు అనుకున్నాడు .ఒకరోజు శని దగ్గరకు వెళ్ళి నువ్వు ఎవరితోనైనా తలపాడు కానీ హనుమంతుడితో మాత్రం వద్దు అన్నాడు .శని అసలే విజయ గర్వంతో ఉన్నాడు ఎలాగైనా హనుమంతుడిని పట్టి శని ప్రభావం చూపిస్తే అందరి కన్నా నేను గొప్పవాడిని అవుతాను అనుకున్నాడు.హనుమంతుడు సేతు ప్రదక్షిణం చేస్తున్నాడు ఆయనను చూసి నేను నిన్ను పట్టుకుంటాను అన్నాడు శనీశ్వరుడు. హనుమ , ఇప్పుడు నేను రామకార్యంలో ఉన్నా ఇది సరిఅయిన సమయం కాదు తర్వాత పట్టుకుందువులే అన్నాడు.
దాంతో శనీశ్వరుడుకి మరింత పట్టుదల పెరిగింది మరల హనుమను విసిగించసాగాడు.ఎన్నిసార్లు హెచ్చరించినా వినకుండా అలాగే ప్రవర్తిస్తుండటంతో ఆగ్రహించాడు హనుమంతుడు . సేతు ప్రదక్షిణం చేస్తూనే తన తోకతో శనిని బంధించి రాళ్ళురప్పలకేసి తిప్పి తిప్పి కొడుతూ ముప్పతిప్పలు పెట్టసాగాడు . దాంతో శనీశ్వరుడికి ఒళ్ళంతా గాయలవుతున్నాయి ఆ బాధ భరించలేక ఆంజనేయా ! మహాప్రభూ ! నన్ను వదిలిపెట్టు మరెప్పుడూ నీ జోలికి రాను అని శనీశ్వరుడు బతిమిలాడాడు.కానీ ఆంజనేయుడు తన తోకతో హింసించసాగాడు.శనీశ్వరుడు మళ్ళీ మళ్ళీ ప్రాధేయపడగా హనుమంతుడు నువ్వు నా జోలికి గానీ నా భక్తుల జోలికి గాని రానని , ఎవరిని ఈ విధంగా ఇబ్బంది పెట్టనని నాకు మాట ఇస్తేనే వదిలి పెడతా అన్నాడు, సరే అన్నాడు శనీశ్వరుడు.అందువల్ల శని ప్రభావం వున్నప్పటికీ ఆంజనేయ స్వామిని ఆరాధించేవారికి సమస్యలు ఎదురవవు.శనీశ్వరుడు తన గాయాలకు నువ్వుల నూనె రాసుకొని ఉపశమనం పొందాడు .ఆ కారణంగా శనీశ్వర శాంతి కోసం నువ్వులనూనెతో అభిషేకం చేస్తారు.
తాడినీ తన్నేవాడు ఒకడు అయితే వాడి తల తన్నేవాడు ఒకడు ఉంటాడు అంటారు పెద్దలు . మనకు బలం అధికారం ఉన్నాయి కదా అని ఒకరిని ఇబ్బంది పెడితే మనకు అదే పరిస్థితి ఎదురు అవ్వొచు జాగ్రత్త.
Nice Akka
ReplyDeletevery nice💐🙏
ReplyDelete